ఏలూరు, పశ్చిమ వాహిని, మే 7: రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు కలపర్రు టోల్‌గేట్ వద్ద హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పెదవేగి ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ పర్యవేక్షణలో పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి బైక్ రైడర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి వారికి జరిమానాలు విధించకుండా, వెంటనే హెల్మెట్‌లు కొనుగోలు చేయించి భద్రతపై చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ హైవేపై హెల్మెట్ లేకుండా ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీయవచ్చని పేర్కొన్నారు. కారు డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.
“మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల మీకే కాక ఇతరులకు కూడా ప్రమాదం జరుగుతుంది. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి” అని ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు పలువురు వాహనదారులు పాల్గొన్నారు.


