తాజా వార్తలు

10/recent/ticker-posts

అమరజీవి అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించిన ఏలూరు పోలీస్ అధికారులు


ఏలూరు, పశ్చిమ వాహిని,  మే 7: అమరజీవి Alluri Sitarama Raju వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి. మునిరాజా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.


ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య సమరంలో అపారమైన సేవలు అందించిన గొప్ప యోధుడని కొనియాడారు. మన్యం ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు గిరిజనులపై సాగించిన అరాచకాలకు ధైర్యంగా ఎదిరించి పోరాటం కొనసాగించారని తెలిపారు. గిరిజనుల హక్కులు, పోడు వ్యవసాయ భూముల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

అతి చిన్న వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు ఎదురొడ్డి పోరాడిన అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ అధికారులు చిత్రహింసలకు గురిచేసి హతమార్చారని గుర్తుచేశారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువరని పేర్కొన్నారు. అల్లూరి నిస్వార్థ సేవలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఏఓ షేక్ మస్తాన్, ఆర్‌ఐలు పవన్ కుమార్, సతీష్ కుమార్, బి-సెక్షన్ సూపరింటెండెంట్ పి. నాగేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐ భాస్కరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.