ఏలూరు, పశ్చిమ వాహిని, మే 7: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. గురువారం ఏలూరు నగరంలోని శనివారాపుపేట-1 స్వర్ణవార్డు సచివాలయంలో నిర్వహించిన “వన్ మంత్ – వన్ విలేజ్ – 4 విజిట్స్” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు, రైతుల రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. భూవివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూ రికార్డుల సవరణలు మరియు ఇతర రెవెన్యూ సమస్యలను గ్రామస్థాయిలోనే స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
“వన్ మంత్ – వన్ విలేజ్ – 4 విజిట్స్” కార్యక్రమంలో భాగంగా మొదటి గ్రామసభను శనివారాపుపేటలో నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు అధికారి జి. వెంకటనాయుడు, తహసీల్దార్ కె. గాయత్రీదేవి, వివిధ శాఖల అధికారులు, స్వర్ణవార్డు ఉద్యోగులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


