తాజా వార్తలు

10/recent/ticker-posts

ఆగిరిపల్లి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. భార్య అక్రమ సంబంధమే హత్యకు కారణమని వెల్లడి


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 7: ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెడ్డి సులోమన్ రాజు హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ కెవీవీఎన్ ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.


ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 66/2026 కింద నమోదైన ఈ కేసులో, గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలోని జగనన్న కాలనీలో ఎన్‌డీఆర్‌ఎఫ్ గేట్ సమీపంలో రెడ్డి సులోమన్ రాజు (41), వడ్లమాను గ్రామ నివాసి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు.

దర్యాప్తులో మృతుడి భార్య రెడ్డి దుర్గామణి గత మూడు సంవత్సరాలుగా వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న పలగాని వెంకన్నబాబుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం భర్తకు తెలిసిన తర్వాత కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు వెల్లడించారు. భర్త వేధింపులకు విసిగిపోయిన దుర్గామణి తన భర్తను హత్య చేయించాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ నేపథ్యంలో వెంకన్నబాబు తన బంధువుల ద్వారా కలతోటి సాయి శ్రీనివాస్, మద్దాలి జస్వంత్ రాయ్ తదితరులతో సంప్రదించి సుమారు రూ.12 లక్షలకు హత్య ఒప్పందం కుదుర్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పథకం ప్రకారం సులోమన్ రాజును హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో కలతోటి సాయి శ్రీనివాస్, మద్దాలి జస్వంత్ రాయ్, కలతోటి మణికంఠ, పలగాని వెంకన్నబాబు, రెడ్డి దుర్గామణి అనే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన AP 40 JC 5757 నంబరు గల బలెనో కారు, ఐదు సెల్‌ఫోన్లు, పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్ వైర్, ఖాళీ బీరు సీసాలు, రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు దర్యాప్తులో నూజివీడు రూరల్ సర్కిల్ సీఐ కె. రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్ఐ కె. శుభశేఖర్, చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ మరియు ప్రత్యేక పోలీసు బృందాలు కీలక పాత్ర పోషించాయి.