తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 10: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు మే 9, 10 తేదీల్లో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఏలూరు 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.


ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహనం నడిపే వ్యక్తులతో పాటు ఎలాంటి తప్పు చేయని అమాయక ప్రజలు కూడా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు తమ కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.

రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పోలీసులు కోరారు. “త్రాగి వాహనం నడపవద్దు.. మీ ప్రాణం, ఇతరుల ప్రాణాలు అమూల్యమైనవి” అని ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.