ఏలూరు, పశ్చిమ వాహిని, మే 10: ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈపీఎఫ్ పెన్షన్ పెంపు డిమాండ్ చేస్తూ సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచడంతో పాటు డీఏ లింక్ చేయాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా అందుతున్న పెన్షన్ అత్యంత తక్కువగా ఉండటం వల్ల వృద్ధాప్యంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 35 ఏళ్ల సేవ చేసిన కార్మికులకు కూడా రూ.3 వేల లోపు పెన్షన్ రావడం దురదృష్టకరమన్నారు.
ఏలూరులోని ఎన్టీఆర్ కాలనీ, ఆముదాల అప్పలస్వామి కాలనీ, నెహ్రూనగర్, రామకృష్ణాపురం, జ్వాలా పరమేశ్వరి కాలనీ, కొత్తపేట తదితర ప్రాంతాల్లో గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించి విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి పెన్షనర్లను సోమవారం జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈపీఎఫ్ఓలో లక్షల కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు తగిన పెన్షన్ ఇవ్వడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 82 లక్షల మంది పెన్షనర్లలో 90 శాతం మందికి చాలా తక్కువ పెన్షన్ అందుతోందని పేర్కొన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, పీఎఫ్ ట్రస్ట్ బోర్డు, సుప్రీంకోర్టు కూడా కనీస పెన్షన్ పెంపుపై సూచనలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే కనీస ఈపీఎఫ్ పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని, ఆరు నెలలకు ఒకసారి పెరిగే డీఏను అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బుడుమూరు శ్రీనివాసరావు, కింతల చిట్టయ్య, కె. దేవేందర్, కొంపంగి కృష్ణ, కవిటి జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.


