ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, మే 9: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు లాభాలు కలగడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వంగలపూడి అనిత పేర్కొన్నారు. విజయవాడలోని ఎస్‌ఎల్‌వీ గ్రీన్ విల్లాస్‌లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రారంభించిన మొబైల్ వెహికల్‌ను శనివారం మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయంసమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పరిమిత వనరులతోనే పలు దేశాలు మిద్దె తోటల ద్వారా అధిక దిగుబడులు సాధిస్తున్నాయని, ఆ తరహాలోనే రాష్ట్రంలో కూడా సహజ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ఆదరణ పెరుగుతోందని మంత్రి అన్నారు. విజయవాడ వంటి నగరాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనను వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలు రైతులకు మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందిస్తాయని చెప్పారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ ఆరోగ్యకరమైన పంటల సాగు వైపు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సానుకూల మార్పులు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వి. నాగప్రమీల రాణి, ప్రకృతి వ్యవసాయ రైతులు, అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.


