ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: పెదపాడు శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం బుధవారం విద్యార్థుల సందడితో ఉత్సాహంగా కొనసాగింది. విద్యార్థుల్లో పఠనాభిరుచి, విజ్ఞాన వికాసం, సృజనాత్మకత పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పలు విద్యా, వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా గ్రామ పెద్ద అక్కినేని శ్రీరామకృష్ణ విద్యార్థులకు అభయారణ్యాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. భారతదేశంలో అనేక రకాల వన్యమృగాలు ఉన్నాయని, తూర్పు మరియు దక్షిణాఫ్రికా తర్వాత అత్యధిక వన్యజీవ వైవిధ్యం భారత ఉపఖండంలోనే కనిపిస్తుందని వివరించారు. దేశంలో కేవలం 14 శాతం భూభాగంలో మాత్రమే అడవులు ఉన్నప్పటికీ, అభయారణ్యాలు, నేషనల్ పార్కులు, సముద్ర జీవ సంరక్షణ కేంద్రాల ద్వారా వన్యప్రాణులను పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల్లో కూడా సాగర జీవ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని విద్యార్థులకు వివరించారు.
అనంతరం విద్యార్థులతో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థుల చేత తెలుగు పద్యాలు, వేమన శతక పద్యాలు చెప్పించడం ద్వారా భాషా పట్ల ఆసక్తి పెంపొందించారు. తర్వాత రిసోర్స్ పర్సన్ అట్లూరి సతీష్, పంతుల జోగారావు రచించిన “చిట్టిబాబు చిట్టి కథలు” పుస్తకంలోని “చిన్నారి చిట్టెలుక సాహసాలు – మరుగుజ్జుల రాజ్యం” కథలను విద్యార్థులతో చదివించి పుస్తక పఠనం నిర్వహించారు.
విద్యార్థులకు ఆటవిడుపుగా క్రికెట్ ఆట నేర్పించి ఆడించారు. వినోద కార్యక్రమాల్లో భాగంగా బాలికలతో పాటలు పాడించి అందరినీ అలరించారు. విద్య, వినోదం కలగలిపిన ఈ కార్యక్రమాలు చిన్నారులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు మరియు 33 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు.


