ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: జిల్లాలో “వన్ మంత్ – వన్ విలేజ్ – 4 విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతి నెల ఒక గ్రామంలో సమర్థవంతంగా నిర్వహించి గ్రామస్థాయి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి కార్యక్రమ అమలుపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ముఖ్యంగా రెవిన్యూ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ప్రతి మండల తహసీల్దార్ తమ పరిధిలో నెలకు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ప్రతి గురువారం గ్రామసభ నిర్వహిస్తూ నాలుగు విడతల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా రీ-సర్వే జరిగిన గ్రామాలు, రెవిన్యూ సమస్యలు అధికంగా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
మొదటి గురువారం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి, గ్రామసభ ద్వారా వినతిపత్రాలు స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి, మిగిలిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, చెరువులు మరియు ఇతర ఆస్తులను పరిశీలించాలని ఆదేశించారు.
రెండవ గురువారం సర్వే రికార్డుల ప్రకారం భూములు, చెరువుల స్థితిని పరిశీలించాలని, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించాలని పేర్కొన్నారు. మూడవ గురువారం మ్యుటేషన్, ఆర్‌ఓఆర్ సవరణలు తదితర రెవిన్యూ సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుని, సంబంధిత ఉత్తర్వులను ఫిర్యాదుదారులకు అందించాలని తెలిపారు.
నాలుగవ గురువారం గ్రామసభ నిర్వహించి పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని, పరిష్కార విధానంపై గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు మినహా గ్రామంలో రెవిన్యూ సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమం ముగిసే నాటికి ఎంపిక చేసిన గ్రామంలో సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో పరిష్కారం కల్పించాలన్నారు.
ఈ నెల 7వ తేదీ గురువారం నుంచే జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ నెలలో ఏ గ్రామంలో కార్యక్రమం నిర్వహించనున్నారో ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని, కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేపట్టి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ దేవకీదేవి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవోలు కిషోర్, రమణ, మండల తహసీల్దార్లు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


