ఏలూరు, పశ్చిమ వాహిని, మే 9: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించాయి. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో రికార్డులు లేని 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల సందర్భంగా నాటుసారా తయారీలో ఉపయోగిస్తున్న 20 పెద్ద అల్యూమినియం పాత్రలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకొని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీ, నిల్వలు మరియు అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్. సుష్మిత, చింతలపూడి సీఐ క్రాంతి కుమార్, చింతలపూడి ఎస్సై సతీష్ కుమార్, ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ తరఫున ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె.వి.ఎన్. ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య, ఏపీఈఎస్ జి. పాండురంగారావు తదితర అధికారులు పాల్గొన్నారు.
అధికారులు మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మద్యం తయారీ, బెల్ట్ షాపులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలను అరికట్టడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు కూడా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.


