ఏలూరు, పశ్చిమ వాహిని, మే 9: ఆనం రామనారాయణరెడ్డి శనివారం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం లో రూ.29 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్, అనివిట్టి మండపం, శివాలయ రాజగోపురాన్ని ప్రారంభించి ఆలయ అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ముందుగా రూ.12.50 కోట్లతో నిర్మించిన ఆధునిక క్యూ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించి, అక్కడ భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. క్యూ లైన్లలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు అందించాలన్నారు. అలాగే ఎండ ప్రభావానికి గురయ్యే భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం రూ.12 కోట్లతో నిర్మించిన విశాలమైన అనివిట్టి మండపాన్ని ప్రారంభించారు. మండపంలోని శిల్పకళా వైభవాన్ని పరిశీలించిన మంత్రి, నిర్మాణ పనులను ప్రశంసిస్తూ ఆలయ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తీర్ణం, ఉపాలయాలు, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు మంత్రికి వివరించారు.
తర్వాత కొండపై ఉన్న శివాలయంలో రూ.4.50 కోట్లతో నిర్మించిన ఐదు అంతస్తుల రాజగోపురాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేసి భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, వంశపారంపర్య ధర్మకర్త మండలి చైర్మన్ రాజా సూరానేని వెంకట సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త సూరానేని నివృతిరావు, ప్రధాన అర్చకులు పి.వి.ఎస్.ఎస్.ఆర్.జె. ఆచార్యులు, దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ మరియు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి రామకృష్ణ, డీఎస్పీ శ్రావణ్ కుమార్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


