ఏలూరు, పశ్చిమ వాహిని, మే 9: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ను సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు, వేద పండితులు మరియు అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు.
శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రి ఆనంకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, వంశపారంపర్య ధర్మకర్త మండలి చైర్మన్ రాజా సూరానేని వెంకట సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త సూరానేని నివృతిరావు, ప్రధాన అర్చకులు పి.వి.ఎస్.ఎస్.ఆర్.జె. ఆచార్యులు, దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ మరియు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వేద పండితులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచన మండపంలో వేద ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ పరిరక్షణ, సంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ద్వారకాతిరుమల దేవస్థానం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అనంతరం ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి రామకృష్ణ, డీఎస్పీ శ్రావణ్ కుమార్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.


