ఉంగుటూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 30: సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. చేపలు, రొయ్యలకు స్థిరమైన గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ యూనిట్ రూ.1.50 సబ్సిడీ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఉంగుటూరు మండలం కైకరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆక్వా, మొక్కజొన్న రైతుల సమస్యలపై విస్తృత చర్చ జరిగింది. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులు, సుంకాలు, యుద్ధాల ప్రభావంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతుండగా, మార్కెట్‌లో స్థిరమైన ధరలు లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు.
ఆక్వా ఫీడ్ తయారీలో ఉపయోగించే సోయాబీన్ వంటి ముడి సరుకుల ధరలు తగ్గినా, ఫీడ్ ధరలు తగ్గించకపోవడం అన్యాయమని విమర్శించారు. సీడ్, ఫీడ్ నాణ్యత కూడా సరిగా లేకపోవడం రైతులకు మరింత ఇబ్బందిగా మారిందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఫీడ్ ధరలు నియంత్రించి, నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ సబ్సిడీ పథకం యూనిట్‌కు రూ.1.50 చొప్పున అన్ని ఆక్వా రైతులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పెంచిన ట్రాన్స్‌ఫార్మర్ ధరలను తగ్గించడంతో పాటు, ఆక్వా రంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలని కోరారు. కాలువల మరమ్మతులు, ఆధునీకరణ ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలని, ముఖ్యంగా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
కొల్లేరు ప్రాంతంలో కాంటూర్ సమస్యలను పరిష్కరించాలని, ఎకో సెన్సిటివ్ జోన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ మొక్కజొన్న రైతుల సమస్యలను ప్రస్తావించారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు జరగడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర అమలు చేసి, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


