ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 19: ఏలూరు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “పల్లె నిద్ర” కార్యక్రమం భాగంగా ఆగిరిపల్లి మండలం పోతవరపు పాడు గ్రామంలో 18/19-04-2026 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ మరియు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో రాత్రి గడుపుతూ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శుభ శేఖర్ గ్రామస్థులతో సమావేశమై సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం సమాజానికి హానికరమని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
ఇంటి దొంగతనాల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టడంలో సహాయపడతాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం ఇస్తే 10 నిమిషాల లోపు పోలీసులు సహాయం అందిస్తారని ప్రజలకు భరోసా కల్పించారు.
సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పిస్తూ, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా మత్తు పదార్థాల నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1972ను వినియోగించాలని తెలిపారు.
పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్ఐ సూచించారు. నదులు, చెరువులు, విహారయాత్రలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఇంటి వద్ద ఆడుకునే సమయంలో కూడా పర్యవేక్షణ అవసరమని వివరించారు. చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శుభ శేఖర్ మాట్లాడుతూ, “పల్లె నిద్ర” కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతపై విశ్వాసం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.



