ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 22: వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె తాగునీరు, పారిశుధ్యం, జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు సమర్థవంతంగా అందేలా ఆర్‌డబ్ల్యూఎస్ మరియు పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా మంచినీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపి నీటి నిల్వలను ముందస్తుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలకు వేసవిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా చేపట్టిన పనులపై కలెక్టర్ సమీక్షిస్తూ మొత్తం 1223 పనుల్లో ఇప్పటివరకు 858 పనులు పూర్తి చేయబడినట్లు తెలిపారు. వీటి కోసం సుమారు రూ.11.23 కోట్ల వ్యయం జరిగిందని చెప్పారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే జిల్లాలోని 266 హౌసింగ్ కాలనీలకు సంబంధించి రూ.861 లక్షల వ్యయంతో 96 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)లో నమోదైన ప్రతి తాగునీటి సమస్య పిటిషన్‌ను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
హర్ ఘర్ జల్ పథకం కింద జిల్లాలో 18 కొత్త నీటి సరఫరా పనులు చేపట్టేందుకు రూ.85.72 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్ వెల్లడించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు మరియు మరుగుదొడ్లకు సంబంధించిన 505 పనుల్లో 493 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తిచేయాలని ఆదేశించారు.
గ్రామాల్లో పశువులు, పక్షులకు వేసవిలో నీటి కొరత లేకుండా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలతో పాటు జీవజాలానికి కూడా తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
శ్రీసత్యసాయి ప్రాజెక్ట్ అమలులో ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ శాఖ పోల్స్ ఏర్పాటు చేసే సమయంలో పైప్‌లైన్లకు ఆటంకం కలగకుండా ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ, విద్యుత్ శాఖలు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి జి. త్రినాధబాబు, వ్యవసాయ శాఖ జేడీ ఎస్.కె. హబీబ్ భాషా, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సి.హెచ్. దేవప్రకాష్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ జెడ్. రమేష్, ఐసిడిఎస్ పీడీ పి. శారద, భూగర్భ జల శాఖ డీడీ పైలా కోదండరామ్, విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ, డీఆర్డీఏ పీడీ టి.వి. విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.



