కుక్కునూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలుగుదేశం మండల అధ్యక్షుడు నాగు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో వెలుగు గ్రామ సహాయకులకు (V.O.A) 5G స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు.
మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు గ్రామ సహాయకులకు ఆధునిక సాంకేతికత కలిగిన స్మార్ట్‌ఫోన్లను అందజేశారు. గ్రామాల్లో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు మరింత వేగంగా ప్రజలకు చేరేలా ఈ చర్య ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు నాగు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా గ్రామాల్లో సేవల నాణ్యత పెరుగుతుందని అన్నారు. వెలుగు మహిళా సహాయకుల పనితీరును డిజిటలైజ్ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు అవుతాయని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, గ్రామ స్థాయిలో మహిళలకు సమాచారం త్వరగా చేరేలా ఈ స్మార్ట్‌ఫోన్ పంపిణీ కార్యక్రమం దోహదపడుతుందని నాయకులు తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి గ్రామ మహిళకు సకాలంలో చేరేలా సహాయకులు కీలక పాత్ర పోషించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎం భానుమతి, టీడీపీ అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరావు, జనసేన అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్, బీజేపీ అధ్యక్షులు కె.వి.ఎన్. దొర, టీడీపీ సీనియర్ నాయకులు కోటగిరి, మాజీ సర్పంచ్ పిచ్చుక రాజు, నరుకుల్ల సత్యనారాయణ, జనసేన ఉపాధ్యక్షులు మంత్రి గోపాలకృష్ణ, జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ గంధం నాగరాజు, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.



