ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 8: పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీలకు భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, చింతలపూడి ఎత్తిపోతల పధకం, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు, తదితర కార్యక్రమాలకు భూ సేకరణ పై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిర్మించే కాలనీలకు సంబంధించి భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేసి, కాలనీ నిర్మాణ ఏజెన్సీలకు అప్పగించాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి మిగిలి ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకంలో భూసేకరణ చేయవలసిన భూవిస్తీర్ణం వివరాలతో నివేదిక వెంటనే సమర్పించాలని, భూసేకరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు.
జిల్లాలోని ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ పనులను కూడా వేగవంతం చేయాలని, దెందులూరు నియోజకవరంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు సెరికల్చర్ కు సంబందించిన భూమి సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అదేవిధంగా నూజివీడు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు నకు భూసేకరణకు భూమిని వెంటనే గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ భాస్కర్, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో లు కిషోర్, రమణ, , కలెక్టరేట్ భూసేకరణ విభాగ అధికారి పోతురాజు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జెడ్ఎం బాబ్జి, జిల్లా భూసేకరణ అధికారులు, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ,తదితరులు పాల్గొన్నారు.


