తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరు జిల్లా పోలీసులకు కార్పొరేట్ చేయూత – చింతలపూడి పోలీసులకు రూ.10 లక్షల వాహనం అందజేత


ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: పోలీసు సేవలను మరింత బలోపేతం చేయడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ యాజమాన్యం చింతలపూడి పోలీసులకు రూ.10 లక్షల విలువైన బొలెరో వాహనాన్ని అందజేసింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ చేతుల మీదుగా ఈ వాహనాన్ని అధికారికంగా అందించారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాధితులకు సత్వర న్యాయం అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీసుల పనితీరును వేగవంతం చేయడానికి ఇలాంటి సహకారం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ జయప్రకాశ్ నారాయణ స్వయంగా పాల్గొని వాహనం తాళాలను ఎస్పీకి అందజేశారు. పోలీసుల అవసరాలను గుర్తించి, నేర నియంత్రణకు తోడ్పడేలా వాహనం అందించినందుకు యాజమాన్యాన్ని ఎస్పీ అభినందించారు.

రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా అధికంగా వనరులు లభిస్తున్నాయని, ఇప్పటివరకు 10 హైటెక్ రూములు కూడా ఏర్పాటు చేయబడినట్లు ఎస్పీ తెలిపారు. ఇది పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

గతంలో చింతలపూడిలో జరిగిన కనకదుర్గ ఫైనాన్స్ బంగారం దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించి, దోచుకున్న సొత్తును తిరిగి యాజమాన్యానికి అప్పగించిన నేపథ్యంలో, పోలీసుల సేవాభావాన్ని గుర్తించి ఈ వాహనాన్ని అందించినట్లు తెలిపారు.

కేసుల దర్యాప్తు, నిందితుల పట్టివేత, అత్యవసర సమయంలో ప్రజలకు తక్షణ సహాయం అందించడంలో ఈ వాహనం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. సమాజ రక్షణ కోసం చేసే దానం అత్యంత గొప్పదని, పోలీసులకు ప్రజల సహకారం అవసరమని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు. రవిచంద్ర, చింతలపూడి సీఐ క్రాంతి కుమార్, జంగారెడ్డిగూడెం ఇన్‌స్పెక్టర్ ఎం.వి. సుభాష్, ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న, కనకదుర్గ ఫైనాన్స్ ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.