తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరులో భగత్‌సింగ్ వర్ధంతి సభ – అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాలకు వ్యతిరేకంగా నిరసనలు


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 23: భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతిని సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా నిర్వహిస్తూ పీడీఎస్ఓ–ఎన్‌వైఎస్ జిల్లా కమిటీలు యుద్ధ వ్యతిరేక ప్రదర్శన చేపట్టాయి. ఫైర్ స్టేషన్ నుంచి కొత్త బస్టాండ్ సమీపంలోని అల్లూరు సత్యనారాయణ భవనం వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమెరికా, ఇజ్రాయిల్ దేశాల యుద్ధోన్మాద చర్యలను ఖండించారు.


ప్రదర్శనలో భాగంగా ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రపంచ దేశాలపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలని, ఇరాన్ ప్రజలకు సంఘీభావం తెలపాలని విద్యార్థి, యువజనులు పిలుపునిచ్చారు.

అనంతరం అల్లూరు సత్యనారాయణ భవనంలో నిర్వహించిన సభలో పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్. భాను అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రత్యేక సంచికను విడుదల చేసిన మాజీ సూపరింటెండెంట్ రావి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తిగా ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసి వైద్య రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సురేష్ మాట్లాడుతూ భగత్‌సింగ్ సమానత్వ సమాజం కోసం పోరాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం అమెరికా ఆధిపత్య ధోరణి ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతోందని, ఇరాన్‌పై జరుగుతున్న దాడులు దానికి ఉదాహరణగా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకపోవడం ఆందోళనకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పి.పి. శాస్త్రి, రచయిత తలారి మోహన్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఎన్‌వైఎస్ నాయకులు, విద్యార్థులు, యువజనులు పాల్గొన్నారు.