తాజా వార్తలు

10/recent/ticker-posts

భగత్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం – ఏలూరులో సిఐటియు ర్యాలీ


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 23: భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ వర్ధంతి సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సిఐటియు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో కార్మికులు, నాయకులు పాల్గొని డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీళ్లు కూడా సరైనంగా అందించలేని ప్రభుత్వాలు మద్యం, డ్రగ్స్‌ను సులభంగా అందుబాటులోకి తీసుకువస్తున్నాయని విమర్శించారు.

ప్రజాప్రతినిధులే డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడడం దురదృష్టకరమని, ఇది డ్రగ్ మాఫియాతో రాజకీయ సంబంధాలను సూచిస్తోందని ఆయన ఆరోపించారు. అక్రమ సంపాదన కోసం యువత భవిష్యత్తును పణంగా పెట్టడం దారుణమని పేర్కొన్నారు.

డ్రగ్ మాఫియాను తక్షణమే అరికట్టాలని, లేదంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దీనికి మద్దతు ఇస్తోందనే అభిప్రాయం ఏర్పడుతుందని హెచ్చరించారు. యువతను రక్షించేందుకు సిఐటియు పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు మంచర్ల ఇస్సాకు, నాయకులు ఎం. నాగమణి, కే. పోచమ్మ, టీ. మాణిక్యం, పీఎల్ఎస్ కుమారి, స్వర్ణ కుమారి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు హైమావతి తదితరులు పాల్గొన్నారు.