ఏలూరు జిల్లా నూజివీడు, పశ్చిమ వాహిని, మార్చి 23: నియోజకవర్గంలోని చాట్రాయి గ్రామంలో జరిగిన అంబటి అనుదీప్ అనుమానాస్పద మృతి కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 17 ఏళ్ల యువకుడి మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం కోసం ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనుదీప్ కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి తమ వేదనను వివరించారు.
జనసేన నాయకులు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనుదీప్ మృతి వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెడ్డి అప్పలనాయుడు, “నూజివీడులో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. మృతుడు మా పార్టీ కార్యకర్త కావడంతో ఈ ఘటనపై మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వం, పోలీసులు గమనించాలి” అని అన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి కూడా ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
అనుదీప్ మృతి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని, స్థానిక పోలీసులతో పాటు ఇతర ప్రాంతాల అధికారులతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, సీసీ కెమెరా ఫుటేజ్ సహా అన్ని ఆధారాలను పరిశీలించి నిజాన్ని బయటపెట్టాలని ఆయన కోరారు. ఎలాంటి పక్షపాతం లేకుండా న్యాయం జరగాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బాధిత కుటుంబానికి హామీ ఇస్తూ, ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టి నిజాన్ని నిగ్గుతేలుస్తామని తెలిపారు. ఈ కేసులో ఎవరు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.








