మచిలీపట్నం/ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 08: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కృష్ణా జిల్లా సమితి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ హాస్టల్ వార్డెన్ మరియు విద్యార్థుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. శివకుమార్, కృష్ణా జిల్లా కార్యదర్శి ఎండి. సాధిక్ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు కాదని, మహిళల హక్కుల సాధన కోసం సాగిన చారిత్రాత్మక పోరాటాలకు ప్రతీకగా నిలిచిన దినమని తెలిపారు. మహిళల సమానత్వం, గౌరవం, ఆర్థిక స్వాతంత్య్రం వంటి విలువలు అభ్యుదయ భావజాలం నుంచి పుట్టుకొచ్చిన మహోన్నత ఆలోచనలని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కార్మిక మహిళలు, పేద మహిళలు ఎదుర్కొన్న అన్యాయాలపై జరిగిన పోరాటాల ఫలితంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని వివరించారు. మహిళలకు సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవనం కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని తెలిపారు. విద్యార్థి ఉద్యమాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.
అలాగే నేటి పాలకవర్గాలు మహిళా దినోత్సవం చారిత్రాత్మకతను విస్మరిస్తూ కేవలం ఉత్సవాలుగా మార్చుతున్నాయని విమర్శించారు. మహిళల అసలు సమస్యలైన భద్రత, ఉపాధి, సమాన వేతనం, ఆర్థిక స్వేచ్ఛ వంటి అంశాలపై ప్రభుత్వాలు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ మహిళలకు భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
మహిళల గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ కోసం విద్యార్థి ఉద్యమాలు కొనసాగాలని పిలుపునిచ్చారు. సమానత్వం ఆధారంగా సమాజ నిర్మాణానికి విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సిద్ధూ, చంటి తదితరులు పాల్గొన్నారు.








