అమలాపురం, పశ్చిమ వాహిని, మార్చి 23: కుందాలపల్లి అట్రాసిటీ ఘటనపై దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు ఆధ్వర్యంలో బాధితులు, దళిత సంఘాల నాయకులు “ఛలో అమలాపురం” కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ కుందాలపల్లి గ్రామంలో దళితుడి అంతిమయాత్రపై జరిగిన దాడి దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుల వివక్షకు మూలమైన శక్తులను అణచివేయాలంటే కఠిన చర్యలే పరిష్కారమని పేర్కొన్నారు.
అట్రాసిటీ కేసుల్లో నిందితులపై పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. చిన్నచిన్న కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు, తీవ్రమైన కుల దాడుల కేసుల్లో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కుందాలపల్లి ఘటనలో నిందితులను కూడా “రెడ్ బుక్”లో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఇతర నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించకపోవడం వల్లే దాడులు మరింత పెరుగుతున్నాయని విమర్శించారు. ఘటన జరిగిన తర్వాత కూడా కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరగడం చట్టపరంగా తప్పని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రేవు తిరుపతిరావు, గిడ్ల వెంకటేశ్వరరావు, మందా సత్యనారాయణ, తులసి, బాబురావు, గుడివాడ ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.








