తాజా వార్తలు

10/recent/ticker-posts

వడదెబ్బ నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు అవసరం – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, మార్చి 23: వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ (హీట్ స్ట్రోక్) బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. ఈ జాగ్రత్తలే వడదెబ్బ నుంచి రక్షణకు కీలకమని ఆయన పేర్కొన్నారు.


సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వడదెబ్బ నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అలాగే బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని, బయటకు వెళ్లినప్పుడు తలకు రక్షణగా టోపీ లేదా గొడుగు వంటివి ఉపయోగించాలని సూచించారు.

అదేవిధంగా తగినంతగా నీరు, ఓఆర్ఎస్ ద్రావణం, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తరచూ తీసుకోవాలని, లేత రంగుల కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రజా ప్రదేశాల్లో పోస్టర్లు ప్రదర్శించాలని అధికారులకు ఆదేశించారు.

గ్రామస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. సుహాసిని, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.