తాజా వార్తలు

10/recent/ticker-posts

నీటినిల్వలు సంరక్షణ, బాధ్యతాయుతమైన వినియోగం ప్రతి ఒక్కరూ ఆచరించాలి.


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 23: ప్రపంచ నీటి దినోత్సవ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు మరియు ఏపీ కాలుష్య నివారణ బోర్డు సంయుక్తంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు అవగాహన సదస్సును నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ  2026 నీటి ప్రవాహం ఎక్కడో సమానత్వం అక్కడే అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, సురక్షితమైన నీటి సంరక్షణ, బాధ్యతాయుతమైన  వినియోగం ప్రోత్సహించటం ప్రతి ఒక్కరూ బాధ్యత అన్నారు. కర్మాగారాలు నుండి వెలువడే వ్యర్థాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించుకోవడం, చెరువులను తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వర్షపు నీటిని ఇంకుడు గుంటలు ద్వారా భద్రపరచడం తదితర యాజమాన్య పద్ధతుల్లో అవలంబించి భూగర్భ జలాలను పెంపొందించు కోవచ్చునని సూచించారు. 
     
ఏపీ కాలుష్య నివారణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మూర్తి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిందని అలాగే వాతావరణ కాలుష్యం వల్ల చెట్లను ఎక్కువగా నరికి వేయడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. చెట్లను విరివిగా పెంచడం, వర్షాకాలం  భవనాలుపై నీటిని ఇంకుడు గుంటలో చేరేటట్లు చర్యలు తీసుకోవడం వల్ల నీటి కొరతను కొంతమేర అధిగమించ వచ్చునని  సూచించారు.

ఈ కార్యక్రమంలో ఫారెస్టు రేంజీ అధికారి డి.రామతులసి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జి.నరసింహా రావు, యు.రాజారావు,స్థానిక ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.