తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 09: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మరియు అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో పారదర్శకంగా నిర్వహించారు. ప్రజలు తమ విలువైన సమయం, డబ్బు వృథా చేయకుండా నేరుగా తమ సమీప సబ్‌డివిజన్ లేదా సర్కిల్ పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందజేయవచ్చని ఎస్పీ సూచించారు.

అలాగే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు రాష్ట్ర ప్రభుత్వ సేవల వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం పొందవచ్చని చెప్పారు.

ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 48 ఫిర్యాదులు అందాయి. వాటిలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, చట్ట ప్రకారం విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారుల కోసం శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు.