తాజా వార్తలు

10/recent/ticker-posts

ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్ట్… రూ.45 లక్షల సొత్తు స్వాధీనం


ముదినేపల్లి, పశ్చిమవాహిని, మార్చి 09: గత సంవత్సరం నుంచి పలు మండలాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


ఈ కేసు దర్యాప్తు ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. రవి కుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి పోలీసులు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం మరియు స్థానిక సమాచారాన్ని విశ్లేషించి నిందితులను గుర్తించి 09-03-2026న ముదినేపల్లి వద్ద అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం నిందితులు ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, పెడన, మొగల్తూరు తదితర ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు మరియు విలువైన వస్తువులను దొంగిలించినట్లు వెల్లడైంది. ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా వీరు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.


నిందితుల వివరాలు:
గొల్ల వంశీ (25) – గుర్వాయిపాలెం గ్రామం, కలిదిండి మండలం
కాల దేవి వర ప్రసాద్ (26) – బాస్కరరావుపేట గ్రామం, కలిదిండి మండలం (ప్రస్తుతం కలిదిండి శివారు మిలిటరీపేట)

పోలీసులు మొత్తం 7 కేసులకు సంబంధించి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అందులో సుమారు 200 గ్రాముల బంగారం (25 కాసులు), 3 కిలోల వెండి ఆభరణాలు, మూడు ఎల్ఈడి టీవీలు, మూడు గ్యాస్ సిలిండర్లు, మూడు మోటార్ సైకిళ్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం విలువ సుమారు రూ.45 లక్షలుగా అంచనా వేస్తున్నారు.

ఈ కేసును ఛేదించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన కైకలూరు రూరల్ సి.ఐ. వి. రవి కుమార్, ముదినేపల్లి ఎస్‌.ఐ. వి.ఎస్‌.వి. భద్రరావు, కలిదిండి ఎస్‌.ఐ. వి. వెంకటేశ్వరరావు మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.