ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, మార్చి 23: శెట్టిబలిజ జాతిపితగా ప్రసిద్ధి చెందిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి తూర్పు గోదావరి జిల్లా బోడసకుర్రు గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్తగా నిలిచారని తెలిపారు. 1853 మార్చి 23న జన్మించిన ఆయన విద్య, ఆర్థిక రంగాల్లోనే కాకుండా సమాజ సేవలో కూడా విశేష కృషి చేశారని గుర్తు చేశారు.
బర్మాలో వ్యాపారం ద్వారా సంపద సంపాదించిన ఆయన, ఆ సంపదను సమాజ అభివృద్ధికి వినియోగించి విద్యా సంస్థలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. శెట్టిబలిజ సమాజాన్ని ఐక్యంగా తీర్చిదిద్దేందుకు 1905లో సంక్షేమ సంఘాన్ని స్థాపించి, విద్యా ప్రోత్సాహానికి కృషి చేశారు. సమాజ గౌరవాన్ని పెంచేందుకు ‘శెట్టిబలిజ’ అనే పేరును ప్రోత్సహించడం ఆయన ప్రత్యేక సేవగా నిలిచింది.
స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1920లో అరెస్టయ్యారని వివరించారు. ఆయన సేవలతో సమాజంలో చైతన్యం పెరిగి స్వాతంత్ర్య భావన బలపడిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి. మునిరాజా, ఆర్‌ఐ పవన్ కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐ వెంకటేష్ తదితరులు, పోలీస్ సిబ్బంది పాల్గొని దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళులు అర్పించారు.








