చింతలపూడి, పశ్చిమవాహిని, మార్చి 09: చింతలపూడి ప్రాంతంలో విద్యుత్ మీటర్ల మార్పిడి, కొత్త సర్వీసుల పేరుతో వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా వినియోగదారుల విద్యుత్ మీటర్లు కాలిపోతే కొత్త మీటర్ అమర్చేందుకు విద్యుత్ శాఖకు డీడీ లేదా ఆన్‌లైన్ చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అయితే మీటర్ షార్ట్ అయి పాడైతే విద్యుత్ శాఖ ఉచితంగా కొత్త మీటర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
కానీ కొన్ని సందర్భాల్లో మీటర్ కాలిపోయినప్పటికీ పై అధికారులకు షార్ట్ అయిందని చూపించి, వినియోగదారుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డీడీ తీసుకోకుండా శాఖకు ఉచితంగా వచ్చే మీటర్లను అమర్చి శాఖను మోసం చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి నెలా అక్రమంగా వసూలైన డబ్బును కొంతమంది పంచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అలాగే కొత్త విద్యుత్ సర్వీసుల నమోదు సమయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. తమ వద్ద పనిచేసే ప్రైవేట్ వ్యక్తుల మొబైల్ నంబర్లకు ఓటీపీలు, అంచనా ఖర్చుల మెసేజ్‌లు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వినియోగదారుడు నేరుగా దరఖాస్తు చేస్తే అనేక నిబంధనలు వర్తిస్తాయని, అదే లైన్‌మెన్‌ను సంప్రదించి డబ్బులు చెల్లిస్తే మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండవని స్థానికులు చెబుతున్నారు.
విద్యుత్ సర్వీస్ ఏర్పాటు చేయడానికి శాఖకు ఎంత చెల్లించాలి అన్న విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియనివ్వకుండా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఈ ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.








