తాజా వార్తలు

10/recent/ticker-posts

సర్వమత సౌహార్దానికి తాళ్లమూడి వేదిక – ముస్లిం సోదరులకు పెదపాడు పోలీసుల శుభాకాంక్షలు


ఏలూరు జిల్లా, పశ్చిమావహిని,పెదపాడు: మత సామరస్యానికి ప్రతీకగా తాళ్లమూడి గ్రామంలో పెదపాడు పోలీసులు ఆదర్శప్రాయ కార్యక్రమం నిర్వహించారు. సర్వమత సమ్మేళనం నినాదంతో పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాళ్లమూడి ఈద్గా వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.


పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా ప్రార్థనలు ముగించుకున్న ముస్లిం సోదరులకు పోలీసులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక హిందూ, క్రైస్తవ మత పెద్దలు కూడా పాల్గొని ముస్లిం సోదరులతో ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలపడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం విభిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని మతాల సారాంశం శాంతి, ప్రేమ అని తెలిపారు. సర్వమత సమ్మేళనం ద్వారా సమాజంలో శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు.

తాళ్లమూడిలో కనిపిస్తున్న ఈ సోదరభావం అందరికీ ఆదర్శమని, మత విద్వేషాలకు తావు లేకుండా ప్రజలు కలిసిమెలిసి జీవించాలని సూచించారు. పండుగల సందర్భంగా అన్ని వర్గాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడం, శాంతియుత వాతావరణంలో వేడుకలు జరగేలా ప్రజలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం స్థానికంగా సానుకూల స్పందనను పొందింది.