తాజా వార్తలు

10/recent/ticker-posts

గోదావరిలో విషాదం – ఐదుగురు యువకులు మృతి


ఏలూరు జిల్లా, పశ్చిమావహిని, మార్చి 21: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గ్రామ పరిధిలో గోదావరి నదిలో ఈతకు వెళ్లిన యువకుల్లో ఐదుగురు మునిగిపోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మొత్తం ఏడుగురు యువకులు నదిలోకి దిగగా, ప్రమాదవశాత్తూ ఐదుగురు నీటిలో చిక్కుకున్నారు.


ఈ ఘటనలో ముగ్గురు యువకుల మృతదేహాలు నిన్ననే గుర్తించగా, గల్లంతైన మరో ఇద్దరు – పాసం సతీష్ కుమార్ (మదనపల్లి), గొనే తేజాగ్న (ఉయ్యూరు) మృతదేహాలు శనివారం గుర్తించారు. ఇదే ఘటనలో చుండూరి దీపక్ (కాలిడిండి), గెడ్డం హర్ష వర్ధన్ (విజయనగరం) సురక్షితంగా బయటపడ్డారు.

జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ పర్యవేక్షణలో కుక్కునూరు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. SDRF, EDRF బృందాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో విస్తృతంగా శోధన నిర్వహించి మృతదేహాలను గుర్తించారు. ఈ గాలింపు చర్యలను పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సమన్వయం చేశారు.

ఈ ఘటనపై పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వేసవి సెలవుల సమయంలో విద్యార్థులు నదులు, జలాశయాల్లో ఈత కొట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకూడదని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుర్ఘటన ప్రాంతంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.