నిడమర్రు, పశ్చిమావహిని, మార్చి 21: రొయ్య రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిడమర్రులోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆక్వా రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతూ రొయ్యల ధరలు తగ్గించడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావంతో ఎగుమతులపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడి రైతులు సంక్షోభంలోకి వెళ్లారని తెలిపారు.
ఆక్వా రంగంలో ఎగుమతిదారులు, వ్యాపారులు సిండికేట్‌లుగా మారి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కౌంట్‌ల వారీగా రొయ్యలకు కనీస మద్దతు ధరలు ప్రకటించి అమలు చేయాలని, నాణ్యమైన సీడ్ మరియు ఫీడ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.
ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు తగ్గినా ఫీడ్ ధరలు తగ్గించకపోవడం రైతులకు భారంగా మారిందని పేర్కొన్నారు. నాణ్యమైన సీడ్ అందించని హ్యాచరీస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఆక్వా రైతులకు కేటాయించిన సబ్సిడీలను పారదర్శకంగా అమలు చేయాలని, ఆక్వా రైతులందరికీ విద్యుత్‌ను యూనిట్‌కు రూ.1.50 పైసలకే అందించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, నారపల్లి రమణారావు, గవర సత్యనారాయణ, వెలగలేటి మోహన్, కంచం వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



.jpeg)








