తాజా వార్తలు

10/recent/ticker-posts

ఐజేయూ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలి – ఎపియుడబ్ల్యుజే పిలుపు


పాలకొల్లు, పశ్చిమావహిని, మార్చి 21: ఈ నెల 27, 28, 29 తేదీలలో విజయవాడలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా APUWJ కార్యవర్గ సమావేశం శనివారం పాలకొల్లు ప్రెస్ క్లబ్ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు జి ఉదయ భాస్కర్ అధ్యక్షత వహించారు.


ఈ సందర్భంగా డి. సోమసుందర్ మాట్లాడుతూ దేశంలో మీడియా పరిస్థితులను మెరుగుపరచడం, వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి భద్రత, వేతనాలు, ఆరోగ్యం వంటి హక్కుల సాధనలో ఐజేయూ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దేశంలోని 27 రాష్ట్రాల్లో ఐజేయూకు అనుబంధ సంఘాలు ఉన్నాయని, దాదాపు 30 వేల మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. మీడియా రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపి పలు తీర్మానాలు ఆమోదించనున్నట్లు పేర్కొన్నారు.


జిల్లా యూనియన్ కార్యదర్శి గజపతి వరప్రసాద్ మాట్లాడుతూ దాదాపు 34 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఐజేయూ ప్లీనరీ సమావేశాలు జరుగుతుండటం గర్వకారణమని అన్నారు. ముఖ్యంగా 28వ తేదీన జరిగే సదస్సుకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరుకావాలని కోరారు. సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ ఐజేయూ ప్లీనరీ విజయవంతానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అక్రెడిటేషన్ జారీ విషయంలో జిల్లా అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ముత్యాల శ్రీనివాస్, తులా భాస్కర్, కృష్ణమోహన్, పి.టి. వెంకటేశ్వరరావు, వై. గిరిజాపతి, జక్కంశెట్టి శ్రీనివాస్, కాగిత సూర్యనారాయణ, విన్నకోట వెంకటరమణ, తోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏప్రిల్ నెలలో యూనియన్ సభ్యత్వ నమోదు చేపట్టి, జిల్లా మహాసభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.