ఏలూరు, ఫిబ్రవరి 21: ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి 1వ వార్డు సచివాలయం పరిధిలో, 27, 28వ డివిజన్లలోని భారతీయ ఆహార సంస్థ గోదాములు ఉన్న ఏటిగట్టు ప్రాంతంలో “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా “ఈ-వ్యర్థాల సేకరణ” ప్రత్యేక కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని ప్రజలతో కలిసి పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వార్డు సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
క్లాప్ మిత్రులతో కలెక్టర్ సంభాషణ..
కార్యక్రమానికి ముందు కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏటిగట్టు ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి క్లాప్ మిత్రులతో మాట్లాడారు. రోజువారీ పని గంటలు, పారిశుధ్య పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్ల శుభ్రత, ఇంటింటి చెత్త సేకరణలో తడి, పొడి చెత్త వేరు చేయడం వంటి విధానాలు అమలు చేస్తున్నామని క్లాప్ మిత్రులు తెలిపారు.
అయితే, అన్ని చోట్ల చెత్త పేరుకుపోవడానికి గల కారణాలను కలెక్టర్ ప్రశ్నించగా, కొన్ని ఇళ్లలో చెత్తను ఆలస్యంగా ఇవ్వడం, రాత్రి వేళల్లో కల్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్ల నుంచి చెత్తను ఇక్కడికి తరలించడం జరుగుతోందని వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ శాశ్వత చర్యలు చేపట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి, చెత్త వేస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ-వ్యర్థాల సేకరణపై అవగాహన..
సభలో కలెక్టర్ మాట్లాడుతూ, పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఛార్జర్లు, బ్యాటరీలు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి హానికరమని పేర్కొన్నారు. వాటిని సక్రమంగా సేకరించడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. జిల్లాలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం మహోద్యమంగా కొనసాగుతోందన్నారు. “శుభ్రమైన ఏలూరు – ఆరోగ్యకరమైన ఏలూరు” లక్ష్యంగా నగర పాలక సంస్థలో నియంత్రణ గది ఏర్పాటు చేశామని, 9491041419 నంబర్‌కు కాల్, సందేశం లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు పంపవచ్చని తెలిపారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల సహకారంతోనే విజయము..
ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రతి నెల మూడవ శనివారం ప్రత్యేక అంశంతో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. తడి, పొడి చెత్త వేరు చేసి క్లాప్ మిత్రులకు అందించాలన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి, పరిశుభ్రమైన పరిసరాలు కల్పించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. పరిశుభ్రత వల్ల వ్యాధులు దూరమవుతాయని, ప్రత్యేకించి శీతాకాలంలో అంటువ్యాధుల నియంత్రణకు శుభ్రత ఎంతో అవసరమని సూచించారు.
విస్తృత స్థాయిలో పాల్గొనడం
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్, ఏలూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది, విద్యార్థులు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులు, సేవా సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు, క్లాప్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రమైన, పచ్చదనంతో నిండిన ఏలూరు నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని నేతలు పిలుపునిచ్చారు.







