తాజా వార్తలు

10/recent/ticker-posts

“వేగం వద్దు – ప్రాణం ముద్దు”: గుండుగోలనులో హెల్మెట్ ప్రత్యేక డ్రైవ్


దెందులూరు,  ఫిబ్రవరి 13: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా దెందులూరు మండలం గుండుగోలనులో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో దెందులూరు ఎస్ఐ శివాజీ తన సిబ్బందితో కలిసి గుండుగోలన సెంటర్ వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 

తనిఖీల సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ISI మార్క్ గల హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులపై వెంటనే జరిమానాలు విధించకుండా, అక్కడికక్కడే హెల్మెట్ కొనుగోలు చేయించి భద్రతపై చైతన్యం కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని ఎస్ఐ శివాజీ హెచ్చరించారు. 

చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని గుర్తు చేశారు.