తాజా వార్తలు

10/recent/ticker-posts

పాల నాణ్యతపై 7 నమూనాలు సేకరణ – కల్తీపై జాగ్రత్తలు పాటించాలని సూచనలు


ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 24: రాజమండ్రిలో ఇటీవల జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో లూజ్ పాలు విక్రయించే కేంద్రాలపై అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో పలు ప్రాంతాల్లో పాల నాణ్యతను పరిశీలించారు.


కృష్ణలంక, పంటకాలువ రోడ్డు, కరెన్సీ నగర్, ప్రసాదంపాడు, గురునానక్ కాలనీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి మొత్తం 7 పాల నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను నాణ్యత నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని విమ్టా ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.

పాలలో కల్తీ జరుగుతున్న అవకాశాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పాలను చిక్కగా కనిపించేలా చేయడానికి పిండిని కలిపే అవకాశం ఉందని, దీన్ని గుర్తించడానికి పాల నమూనాలో రెండు చుక్కలు అయోడిన్ వేస్తే నీలి రంగులోకి మారుతుందని తెలిపారు. పాలలో వెన్న శాతం ఎక్కువగా కనిపించేలా వెజిటబుల్ నూనెలను కలిపే అవకాశముందని, పాలు జిడ్డుగా ఉంటే అనుమానించాలన్నారు.

పాలు చేదుగా ఉండటం లేదా దుర్వాసన వస్తే వాటిని వినియోగించకూడదని సూచించారు. స్వచ్ఛమైన పాలు త్వరగా చెడిపోతాయని, ఎక్కువసేపు నిల్వ ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు కలిపి ఉండవచ్చని హెచ్చరించారు.

పాలలో కల్తీపై అనుమానం ఉన్నట్లయితే ఫుడ్ సేఫ్టీ శాఖ లేదా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పరీక్షల్లో కల్తీ నిర్ధారణ అయితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

లూజ్ పాలను ప్లాస్టిక్ లేదా అల్యూమినియం క్యాన్లలో రవాణా చేయకుండా కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే రవాణా చేయాలని సూచించారు. పాల విక్రయ కేంద్రాలు పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.