ఏలూరు/టి.నర్సాపురం: టి.నర్సాపురం ప్రెస్ క్లబ్ సభ్యుల భద్రతకు ముందడుగు వేస్తూ జనసేన నాయకులు సి.హెచ్. నవీన్ ఒక్కొక్కరికి రూ.15 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీలు చేయించి పాత్రికేయుల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తం 20 మంది ప్రెస్ క్లబ్ సభ్యులకు నవీన్ తన సొంత నిధులతో పోస్టాఫీస్ ప్రమాద బీమా పాలసీలు చేయించారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, ప్రజలకు మరియు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ, సమాజ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న పాత్రికేయ మిత్రులకు తన వంతు బాధ్యతగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే పూర్తిగా తన స్వంత ఖర్చుతో బీమా పాలసీలు చేయించానన్నారు.
పాత్రికేయులు కూడా ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు, అధికారులతో సమానంగా ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అటువంటి వారి భద్రతను చూసుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయాలకు అతీతంగా టి.నర్సాపురం మండల అభివృద్ధికి నిస్వార్థంగా శ్రమిస్తున్న జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించగలిగినందుకు సంతోషంగా ఉందని సి.హెచ్. నవీన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
అధ్యక్షులు పసుమర్తి రాము మాట్లాడుతూ మా పత్రిక విలేకరుల పట్ల ఇంత గొప్ప ఆలోచన చేసి ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయల ప్రమాద బీమా పాలసీని ఏర్పాటుపై మా సభ్యులు అందరు తరఫున మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేశామని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నాదెండ్ల కృష్ణ, గిరి కుమార్, మరీదు నాగేశ్వరరావు, నందికొండ రామకృష్ణ, పరస శీను సుందరం, తదితరులు ఆయనకు అభినందన తెలియజేశారు.







