ఏలూరు/ముసునూరు: ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామంలో శుక్రవారం బాబూ జగ్జీవన్ రామ్, స్వర్గీయ ఎన్.టి.రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అంజలి ఘటించారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి స్మార్డు రైసు కార్డ్స్ పంపిణీ చేశారు. ఇంటి సమస్యలు, గ్రామాల అభివృద్ధి , ఇంటి నిర్మాణాలు, కుటుంబ యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సంధర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులు అందరకీ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్టు రైసుకార్డులు పంపిణీని చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీని మరింత పారదర్శకంగా, జవాబు దారీతనంతో నిర్వహించే లక్ష్యంగా పాత కార్డులు స్థానంలో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రైసు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. రాష్ట్రంలో కార్డు దారులందరికీ స్మార్టు రైసు కార్డులను ఇంటింటికి వెళ్లి అందజేయడానికి నాలుగు దశల్లో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
స్మార్టు రేషను కార్డులు పంపిణీ ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడ నుండైనా రేషను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు.వృద్ధులకు, దివ్యాంగులకు, శివారు గ్రామాలకు ఇంటి వద్దకే రేషను పంపిణీకి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రేషన్ డీలర్లకు మంచి గౌరవం కల్పించామని, వారు కూడా లబ్ధిదారులకు చక్కగా రేషను సక్రమంగా అందించాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దారు డి.ప్రశాంతి, యంపిడివో బి.వి. సత్యనారాయణ,వివిధ శాఖల అధికారులు,కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.