Hot Posts

6/recent/ticker-posts

ముద్రగడ కోసం జగన్ ఎయిర్ అంబులెన్స్... హైదరాబాద్ వెళ్లే ముందు ఓ సారి కిర్లంపూడికి... ముద్రగడ కోరిక!


అవును... అనారోగ్యంతో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభాన్ని హైదరాబాద్ కు తరలించారు.

ANDHRAPRADESH:అనారోగ్యంతో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రెండు రోజులుగా కాకినాడలోని మెడికోవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉందని చెబుతున్నారు. అయితే... మెరుగైన వైద్యం కోసం తాజాగా హైదరాబాద్‌ తరలించారు. అంతకంటే ముందు ఆయన ఒకసారి ఇంటికి వెళ్లాలని కోరడం గమనార్హం.

అవును... అనారోగ్యంతో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభాన్ని హైదరాబాద్ కు తరలించారు. అయితే... హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించే ముందు ఒకసారి తనను ఇంటికి తీసుకెళ్లాలని ముద్రగడ కోరారు. దీంతో.. ఆయనను తొలుత అంబులెన్స్ లో కిర్లంపూడికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట పిఠాపురం వైసీపీ ఇన్ ఛార్జ్ వంగ గీత కూడా ఉన్నారు.

కిర్లంపూడిలో నివాసానికి చేరుకున్న అనంతరం ఎయిర్‌ అంబులెన్స్‌ లో రాజమహేంద్రవరం ఎయిర్‌ పోర్టు నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ సూచనలతో పార్టీ నేతలు ఈ మేరకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం వెంట ఆయన కుమారుడు గిరిబాబు, ఇతర కుటుంబసభ్యుల ఉన్నారు. 

ఈ సందర్భంగా స్పందించిన ముద్రగడ పద్మనాభం కుమారులు బాలు, గిరి బాబు... తమ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా.. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, తరలింపు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. జగన్ సూచన మేరకు హైదరాబాద్ వెళ్తున్నట్లు తెలిపారు.

కాగా... ముద్రగడ పద్మనాభం రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో ఆయనను వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ కు తరలించనున్నట్లు వార్తలొచ్చినా.. వైద్యుల సూచనల మేరకు స్థానిక మెడికోవర్ ఆస్పత్రికే తరలించారు. ఈ విషయం తెలియడంతో జగన్.. ముద్రగడ కుమారుడు గిరిబాబును ఫోన్‌ లో పరామర్శించారు. 

ఈ సందర్భంగా... పద్మనాభం ఆరోగ్యంపై ఆరా తీశారు. ఒకవేళ అత్యవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ తరలించాలని సూచించారు. అయితే ముద్రగడ కాస్త కోలుకున్నారని చెప్పడంతో అక్కడే చికిత్స కొనసాగించారు. అయితే... ముందస్తు జాగ్రత్తగా ముద్రగడను హైదరాబాద్ కు తరలించాలని జగన్ సూచించడంతో.. ఆ పనికి పూనుకున్నారు కుటుంబ సభ్యులు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi