Hot Posts

6/recent/ticker-posts

పాట్నాలో రాహుల్‌గాంధీ, తేజస్వి భారీ నిరసన.. ఈసీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు


ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా బిహార్‌లో విపక్షాల ఆందోళన

ఓటర్ల జాబితా సవరణ, కొత్త కార్మిక చట్టాలపై ఉమ్మడి పోరాటం

రాష్ట్రవ్యాప్తంగా మహాఘట్‌బంధన్ పార్టీల 'చక్కా జామ్', రాస్తారోకోలు

భారత్ బంద్‌కు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలు

పలుచోట్ల రైల్వే ట్రాక్‌ల దిగ్బంధనం, టైర్లు కాల్చి ఆందోళనలు

NATIONAL:కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్), కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బీహార్‌లో విపక్షాలు భారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాట్నాలో సంయుక్తంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉదయం 10 గంటలకు గోలంబర్‌లోని ఆదాయపన్ను కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు వీరిద్దరి నేతృత్వంలో భారీ ర్యాలీ ప్రారంభమైంది.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మహాఘట్‌బంధన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా 'చక్కా జామ్' నిర్వహిస్తోంది. హాజీపూర్, సోన్‌పూర్‌లలో ఆర్జేడీ కార్యకర్తలు టైర్లను కాల్చి రోడ్లను దిగ్బంధించారు. హాజీపూర్‌లోని గాంధీ సేతును ఆర్జేడీ మద్దతుదారులు అడ్డుకోగా, సోన్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే ముఖేశ్ రోషన్ ఆందోళనకు నాయకత్వం వహించారు. జెహానాబాద్‌లో ఆర్జేడీ విద్యార్థి విభాగం రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించి నిరసన తెలిపింది.

ఈ ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికాశ్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), స్వతంత్ర నేత పప్పు యాదవ్‌తో కూడిన మహాఘట్‌బంధన్ మద్దతు ప్రకటించింది. అత్యంత తక్కువ సమయంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ గందరగోళం సృష్టిస్తోందని, ఇది అధికార ఎన్డీయేకు ప్రయోజనం చేకూర్చేందుకేనని తేజస్వి యాదవ్ ఆరోపించారు. 10 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న భారత్ బంద్‌కు మద్దతుగా కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi