ANDHRAPRADESH:నగరంలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. అరెస్టుల సంఖ్య పెరగడంతో పాటు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఈ కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నట్లు, వాళ్లను తప్పించే ప్రయత్నాలు జరిగిపోయాయని సమాచారం.
ప్రశాంత నగరంగా పేరున్న విశాఖ.. ఏడాది కాలంగా నేరాలకు అడ్డాగా మారిపోయింది. ఎన్నడూ లేనివిధంగా తాజాగా డ్రగ్స్ కేసు బయటపడింది. అయితే ఈ విచారణలో తీగ లాగితే లింకులు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత త్రీటౌన్ పోలీసులు ప్రకటించారు. అయితే శనివారం నాటికి అందులో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు చూపించారు. అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, సౌతాఫ్రికాకు చెందిన థామస్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు.
మిగిలిన ముగ్గురిని అనుమానితులుగా పేర్కొన్న పోలీసులు.. ఆదివారం మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నగరానికి చెందిన డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వర్మ రూ. 65 వేల రూపాయలు తో డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని, ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. అయితే.. ఈ కేసులో కూటమి నేతలకు లింకులు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ డ్రగ్స్‌కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నారని సమాచారం. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఓ ఎమ్మెల్యే ఫోన్ కాల్‌తో ముగ్గురిని ఈపాటికే బయటకు పంపించేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Shakir Babji Shaik
Editor | Amaravathi