Hot Posts

6/recent/ticker-posts

రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు


గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న హరీశ్ రావు

13 నెలలుగా భవనాల అద్దె చెల్లించడం లేదని మండిపాటు

విద్యార్థులు చిరిగిన దుస్తులతో పాఠశాలలకు వస్తున్నారని ఆవేదన

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను, ముఖ్యంగా గురుకులాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఆదర్శంగా నిలిచిన గురుకులాల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని, ప్రభుత్వ ఉదాసీనత వల్ల లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని ఆయన ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

గురుకులాలకు ఆహార పదార్థాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు చెల్లించడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే కోడిగుడ్లు, మాంసం, అరటిపండ్ల సరఫరా నిలిచిపోయిందని గుర్తుచేశారు. జులై 1 నుంచి అన్ని రకాల సరఫరాలను నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారని, ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు, గత 13 నెలలుగా గురుకుల భవనాలకు సంబంధించిన అద్దె బకాయిలు పేరుకుపోయాయని హరీశ్ రావు తెలిపారు. సుమారు రూ. 450 కోట్లకు పైగా అద్దె చెల్లించకపోవడంతో, పలు ప్రాంతాల్లో భవన యజమానులు పాఠశాలలకు తాళాలు వేయడం మొదలుపెట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా, విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు వంటి కనీస సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఇప్పటివరకు అందించలేదని ఆయన మండిపడ్డారు. చిన్నారులు పాత, చిరిగిన దుస్తులతో పాఠశాలలకు వస్తున్న దృశ్యాలు తనను కలిచివేశాయని చెప్పారు. కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాల వ్యవస్థ, రేవంత్ రెడ్డి పాలనలో ఇలా నిర్వీర్యం కావడం అత్యంత బాధాకరమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. 
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now