Hot Posts

6/recent/ticker-posts

అమరావతి మహిళలకు క్షమాపణ చెబుతా.. పోలీసుల విచారణలో కృష్ణంరాజు పశ్చాత్తాపం


అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని కృష్ణంరాజు అంగీకారం

జైలు నుంచి వచ్చాక క్షమాపణ వీడియో చేస్తానని వెల్లడి

'సాక్షి' తన బలహీనతను వాడుకుందని విచారణలో ఆవేదన

చంద్రబాబు, టీడీపీపై ద్వేషంతోనే వ్యతిరేక వీడియోలు చేసినట్లు స్పష్టం

మూడు రోజుల పోలీసు కస్టడీ ముగింపు, నేడు కోర్టుకు

AMARAVTI:అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి తాను చేసిన దారుణమైన వ్యాఖ్యలు సరికాదని, అది తాను చేసిన తప్పేనని జ‌ర్న‌లిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు అంగీకరించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి అక్కాచెల్లెమ్మలకు క్షమాపణ చెబుతూ ఒక వీడియోను విడుదల చేస్తానని పోలీసుల విచారణలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. తనకున్న బలహీనతను 'సాక్షి' మీడియా సంస్థ పావుగా వాడుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజు పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. మూడు రోజుల కస్టడీలో భాగంగా చివరి రోజైన నిన్న, తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఆయన్ను విచారించారు. కస్టడీ గడువు పూర్తికావడంతో ఈరోజు ఆయన్ను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచి, అనంతరం జైలుకు పంపనున్నారు. 

రాజధాని ప్రాంత మహిళల పట్ల ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారని పోలీసులు ప్రశ్నించగా.. తాను తప్పు చేశానని, మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదని ఆయన అంగీకరించినట్లు తెలిసింది.

చంద్రబాబుపై ద్వేషమే కారణమా?

గతంలో తాను ఒక ఆంగ్ల పత్రికలో పనిచేస్తున్నప్పుడు తనను ఉద్యోగం నుంచి తొలగించారని, దీని వెనుక అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ఉందని భావించి అప్పటి నుంచి ఆయనపైనా, టీడీపీపైనా వ్యతిరేక భావన పెంచుకున్నానని కృష్ణంరాజు పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఆ కోపంతోనే చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు చేశానని, వాటిని గమనించి 'సాక్షి' ఛానల్ వారు తనను చర్చలకు ఆహ్వానించారని ఆయన చెప్పినట్లు తెలిసింది.

"నాకు వ్యక్తిగతంగా పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం, 'సాక్షి' ఛానల్ చర్చలకు పిలిచి ప్రాధాన్యం ఇవ్వడంతో నాకు గుర్తింపు లభించిందని భావించాను. టీడీపీ, చంద్రబాబుపై నాకున్న వ్యతిరేకతను వారు ఉపయోగించుకున్నారు. నాకున్న ఈ బలహీనతను వారు వాడుకున్నారని ఇప్పుడు అర్థమవుతోంది. వారి కక్ష సాధింపు చర్యల్లో నేను ఒక పావుగా మారాను. ఆ రోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఒక రోజు ముందే నాకు కొంత సమాచారం అందించారు. 

అప్పుడు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటుందని నేను ఊహించలేకపోయాను. వారు ఇచ్చిన సమాచారంతోనే యాదృచ్ఛికంగా ఆ వ్యాఖ్యలు చేశాను" అని పోలీసుల విచారణలో కృష్ణంరాజు వెల్లడించినట్లు సమాచారం. కస్టడీ సమయంలో పోలీసులు ఆయనను వందకు పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణలో సేకరించిన వివరాలతో పోలీసులు కోర్టుకు ఒక నివేదిక సమర్పించనున్నారు.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now