Hot Posts

6/recent/ticker-posts

పల్నాడు జిల్లాలో దారుణం... కొత్త పెళ్లికూతురిపై సామూహిక అత్యాచార యత్నం


పల్నాడు జిల్లాలో నవవధువుపై ముగ్గురి అత్యాచార యత్నం

భర్త ఇంట్లో లేని సమయం చూసి దుండగుల దాడి

అఘాయిత్యాన్ని వీడియో తీసిన ఓ నిందితుడు

పల్నాడు జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే అమానవీయ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లై నెల కూడా గడవకముందే ఓ నవవధువుపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ దారుణంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

వివరాల్లోకి వెళితే, బాధితురాలికి సుమారు 20 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇంట్లో ఆమె భర్త లేని సమయాన్ని గమనించిన ముగ్గురు యువకులు, ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు. ఈ దారుణాన్ని వారిలో ఒకడు తన ఫోన్‌లో వీడియో తీయడం గమనార్హం. అదే సమయంలో బాధితురాలి భర్త ఇంటికి తిరిగి రావడంతో వారి ప్రయత్నం భగ్నమైంది.

అక్కడికి వచ్చిన భర్తను చూసి నిందితులు అతనితో గొడవకు దిగి, అక్కడి నుంచి పరారయ్యారు. జరిగిన అవమానాన్ని, దాడిని తట్టుకోలేకపోయిన నవవధువు తీవ్ర వేదనకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి (GGH) తరలించారు.

ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi