ఈ నెల 20 నుంచి ఓటీటీలో విడుదల
ప్రధాన పాత్రల్లో బాలు - షిన్నోవా
సున్నితమైన భావోద్వేగాలతో నడిచే కథ
ఈటీవీ మొదటి నుంచి కూడా సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథలకు .. కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. అలా ఈటీవీ విన్ ద్వారా పలకరించిన సినిమానే 'ఒక బృందావనం'. ఈ ఏడాది మే 23వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతోంది. సత్య బొత్స దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని కథేమిటనేది చూద్దాం.
కథ: విక్రమ్ (బాలు) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తల్లి .. తండ్రి .. తాతయ్య .. ఇదే అతని ఫ్యామిలీ. అతను ఓ ఫొటోగ్రఫర్ .. ఫంక్షన్స్ కి ఫొటోలు .. వీడియోలు తీస్తూ ఉంటాడు. అతను 'నందిత' అనే యువతిని లవ్ చేస్తాడు. అయితే అతనికి సరైన పొజీషన్ లేకపోవడం వలన, ఆ అమ్మాయి బ్రేకప్ చెబుతుంది. దాంతో ఎలాగైనా యూఎస్ వెళ్లాలనీ .. అక్కడ మంచి జాబ్ సంపాదించాలనే పట్టుదలతో ఉంటాడు.
ఫొటోగ్రఫీలో విక్రమ్ టాలెంట్ గురించి తెలియడంతో, మహా ( షిన్నోవా) అతనిని వెతుక్కుంటూ వస్తుంది. తను చేసే ఒక డాక్యుమెంటరీకి వీడియోగ్రఫర్ గా వర్క్ చేయమని కోరుతుంది. ఫారిన్ వెళ్లడానికి అవసరమైన ఎమౌంట్ వస్తుందనే ఉద్దేశంతో అందుకు అతను ఒప్పుకుంటాడు. ఆ డాక్యుమెంటరీ సమయంలోనే, ఒక అనాథశరణాలయంలో వాళ్లకి నైనిక (సాన్విత) తారసపడుతుంది. కేరళలో ఉన్న జోసెఫ్ రత్నం అనే వ్యక్తి కోసం ఆ పాప ఎదురుచూస్తూ ఉందని తెలుసుకుంటారు.
తన ప్రేమ వ్యవహారం పక్కన పెట్టేసి 'నైనిక'ను కేరళ తీసుకుని వెళ్లాలని విక్రమ్ నిర్ణయించుకుంటాడు. సందీప్ అనే వ్యక్తితో కుదిరిన పెళ్లిని పక్కన పెట్టేసి, నైనిక పనిపై 'మహా' కూడా కేరళ బయల్దేరుతుంది. అలా ఆ పాపను తీసుకుని విక్రమ్ - మహా కేరళ చేరుకుంటారు. అక్కడున్న జోసెఫ్ రత్నం ఎవరు? నైనికతో ఆయనకున్న సంబంధం ఏమిటి? నైనిక తల్లిదండ్రులు ఏమయ్యారు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. వెబ్ సిరీస్ లు .. సినిమాలు కూడా ఈ కంటెంట్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిచ్చే కంటెంట్ పట్ల ఈటీవీ విన్ మొగ్గు చూపుతోంది. అలా వచ్చిన సినిమానే 'ఒక బృందావనం'.
ఒక యువకుడి ప్రేమ .. మరో యువతి పెళ్లి .. అనాథాశ్రమంలోని ఓ పాప చుట్టూ తిరిగే కథ ఇది. ఈ మూడు పాత్రలను తోడుగా చేసుకునే ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. అతనికి కుటుంబం పట్ల బాధ్యత ఉండటాన్ని ఆమె గమనిస్తుంది. ఆమెకి ఫ్యామిలీ పట్ల ప్రేమ ఉండటాన్ని అతను గ్రహిస్తాడు. తనకి అవసరమైన అనురాగాన్ని వాళ్లు అందించగలరని ఆ పాప నమ్ముతుంది. అలాంటి ఆ ముగ్గురి ప్రయాణం ఏ తీరానికి చేరుకుందనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది.
ఈ సినిమాలో ప్రేమ ఉంటుంది .. కానీ డ్యూయెట్లు ఉండవు. ఎమోషన్స్ ఉంటాయి .. అయితే అవి సున్నితంగా మాత్రమే హృదయాన్ని తాకుతాయి. ఇక యాక్షన్ సీన్స్ ఏ మాత్రం కనిపించవు. కామెడీకి కూడా దర్శకుడు అంతగా అవకాశం ఇవ్వలేదు. ఎమోషన్స్ ను ప్రధాన ఆయుధంగా చేసుకునే దర్శకుడు ఈ కథను నడిపాడు. అందువలన అందుకు సిద్ధపడే ఈ కథను ఫాలో కావలసి ఉంటుంది.
పనితీరు: ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు .. కొత్తగా తమ జీవితాన్ని ఆరంభించాలని అనుకుంటారు. అయితే అవతలివారికి కొత్త జీవితాన్ని ఇవ్వడంలోనే అసలైన సంతోషం .. సంతృప్తి దాగి ఉన్నాయనే సందేశంతో కూడిన కథను అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
హీరో .. హీరోయిన్ .. బేబీ సాన్విత పాత్ర పరిధిలో నటించారు. శుభలేఖ సుధాకర్ .. అన్నపూర్ణమ్మ వంటివారు ఈ తరహా పాత్రలను చేయడంలో సిద్ధహస్తులు. రాజ్ కె నల్లి ఫొటోగ్రఫీ .. సన్నీ - సాకేత్ నేపథ్య సంగీతం .. తమ్మిరాజు - సంతోష్ కమ్మిరెడ్డి ఎడిటింగ్ బావుంది.
ముగింపు: సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.