Hot Posts

6/recent/ticker-posts

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. మీ అభిప్రాయం తెలపండి: మంత్రి నాదెండ్ల


రేషన్ డిపోల వద్ద క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఏర్పాటు

స్కాన్ చేసి సరుకులు, డీలర్లపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు

65 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులకు ఇంటికే రేషన్ సౌకర్యం

ఈనెల‌ 26 నుంచే జులై నెల సరుకుల పంపిణీ ప్రారంభం

నూతన విధానాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో పలు కీలక సంస్కరణలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వినియోగదారుల అభిప్రాయాలు, ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ డిపోల వద్ద క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

క్యూఆర్ కోడ్‌తో నేరుగా మీ స్పందన

రేషన్ కార్డుదారులు తమ స్మార్ట్‌ఫోన్లతో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఒక వెబ్ ఫారమ్‌లోకి ప్రవేశిస్తారని మంత్రి నాదెండ్ల‌ వివరించారు. ఈ ఫారమ్‌లో ఆ నెల రేషన్ సరుకులు అందుకున్నారా? లేదా? సరుకుల నాణ్యత ఎలా ఉంది? తూకంలో ఏమైనా తేడాలున్నాయా? రేషన్ డీలర్ ప్రవర్తన, ఏవైనా అధిక ధరలు వసూలు చేశారా? వంటి ప్రశ్నలకు "అవును" లేదా "కాదు" అనే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. 

పౌరులు నమోదు చేసే ఈ వివరాలు, అభిప్రాయాలు నేరుగా ఉన్నతాధికారులకు చేరుతాయని, దీనివల్ల సమస్యలున్న చోట తక్షణమే చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం ద్వారానే పౌర సేవలను మరింత మెరుగుపరచాలన్నది మా ప్రభుత్వ లక్ష్యమ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి వెల్ల‌డించారు. 

వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యం

మరో కీలక నిర్ణయంగా 65 ఏళ్ల‌కు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచే ప్రారంభించినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. వీరికి ఐదు రోజుల ముందుగానే రేషన్ అందజేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా జులై నెలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీని కూడా నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.

గతంలో ఇంటింటికీ రేషన్ పేరిట మొబైల్ యూనిట్ల ద్వారా జరిగిన పంపిణీ విధానంతో పోలిస్తే, ప్రస్తుతం రేషన్ డిపోల ద్వారా జరుగుతున్న పంపిణీ వ్యవస్థ మెరుగైన ఫలితాలను ఇస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. "ప్రజల అభిప్రాయాలే మాకు మార్గదర్శకం. ఈ నూతన వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, సేవలను మరింత మెరుగుపరిచేందుకు సహకరించాలి" అని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విధానాల ద్వారా పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now