ANDRAPRADESH:రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక పోలీసులు ఆంక్షలు విధించారని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు పన్నినా.. జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరన్నారు. గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదని ఫైర్ అయ్యారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అవసరం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెబుతారు అని జగ్గంపూడి రాజా పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో మాజీ సీఎం వైఎస్ పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ కాన్వాయ్‌తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. రాష్ట్రంలో వైఎస్ జగన్‌కు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరు. గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదు. మీ పరామర్శలకు ఇన్ని ఆంక్షలు ఉన్నాయో ఓసారి గుర్తుచేసుకోండి’ అని అన్నారు.
‘కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో సంక్షేమ పథకాలను తెప్ప తగలేశారు.సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం డబ్బులు ఏవి?. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేస్తాం. వాలంటీర్లు నెత్తిన శఠగోపం పెట్టారు. ఎండీయూ వాహనాలను తొలగించి రేషన్ కోసం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు’ అని జగ్గంపూడి రాజా మండిపడ్డారు.