Hot Posts

6/recent/ticker-posts

ఉత్తరకాశీలో ప్రకృతి బీభత్సం.. క్లౌడ్‌బరస్ట్‌కు 9 మంది గల్లంతు


ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ప్రకృతి విలయం

నిర్మాణంలో ఉన్న హోటల్ కూలి 9 మంది గల్లంతు

బార్కోట్-యమునోత్రి మార్గానికి అంతరాయం

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఉత్తరకాశీ జిల్లాలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం (క్లౌడ్ బరస్ట్) కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ వద్ద పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. 

ఉత్తరకాశీ జిల్లా పరిధిలో ఆకస్మికంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ కుప్పకూలింది. నిర్మాణ సమయంలో అక్కడ పనుల్లో ఉన్న కార్మికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండవచ్చని లేదా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

కార్మికుల గల్లంతు ఘటనను ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య ధ్రువీకరించారు. 8 నుంచి 9 మంది కార్మికులు గల్లంతైన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. క్లౌడ్‌బరస్ట్ వల్ల యాత్రికులు ఎక్కువగా ప్రయాణించే బార్కోట్-యమునోత్రి మార్గం కూడా తీవ్రంగా దెబ్బతిందని, దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా, నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi