ANDRAPRADESH, AMARAVATHI: ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. స్కాంలో మరో ముగ్గురికి కూడా పాత్ర ఉందని పేర్కొంటూ సిట్ పోలీసులు తాజాగా కోర్టులో మెమో దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ ప్రతినిధి బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేర్చారు. కేసులో ఏ1 నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలంతో ఈ ముగ్గురు ఇరుక్కున్నారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా వారికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వారిని నిందితుల జాబితాలో చేర్చుతూ మెమో దాఖలు చేశారు. అయితే పోలీసులు దాఖలు చేసిన మెమోను కోర్టు అంగీకరించాల్సివుంది.
ఏపీ లిక్కర్ స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న సీనియర్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యక్తిగత సహాయకుడు క్రిష్ణమోహన్ రెడ్డి, బారతీ సిమెంట్ ప్రతినిధి బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేర్చారు. కేసు దర్యాప్తులో భాగంగా లిక్కర్ స్కాంలో కమీషన్ కింద వసూలు చేసిన మొత్తం ఈ ముగ్గురికి అందజేశామని ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు వాంగ్మూలివ్వడంతో దర్యాప్త వీరి వరకు వచ్చి ఆగింది.
ఈ పరిస్థితుల్లో ఆ ముగ్గురు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రెండు చోట్ల వారికి ఎదురుదెబ్బ తగిలింది. అదేసమయంలో ప్రభుత్వం వారిని అరెస్టు చేసుకోవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. ఇదే అనువుగా తీసుకున్న సిట్ అధికారులు సీనియర్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి ఏ31గా గుర్తించారు. అదేవిధంగా ఏ32గా జగన్ పీఏ క్రిష్ణమోహన్ రెడ్డి, ఏ33గా బాలాజీ గోవిందప్పలకు నంబర్లు కేటాయించారు. దీంతో ఈ ముగ్గురిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.
ముందస్తు బెయిల్ కోసం ధనుంజయరెడ్డితోపాటు మిగిలిన నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్ పై రేపు (మే7 బుధవారం) ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వారి పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా హైకోర్టును ఆదేశించింది. అదేసమయంలో 8న సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారించనుంది. అయితే కోర్టు తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయకుండా రక్షణ ఇవ్వనందున విచారణకు ముందే వారిని అరెస్టు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ విచారణకు ముందే అరెస్టు చేస్తే ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరర్థకమవుతాయని అంటున్నారు. ప్రధానంగా ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిని అరెస్టు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సివుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఆయనకు ఇప్పట్లో ముప్పు ఉండదని అంటున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీగా వ్యవహరించిన ఆయన వ్యక్తిగత సహాయకుడు క్రిష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ ప్రతినిధి బాలాజీ గోవిందప్ప భవిష్యత్తుపైనే ఆందోళన చెందుతున్నారు.