ANDRAPRADESH: టీడీపీ నాయకులు అంటే.. కొన్ని కట్టుబాట్లు.. పార్టీ నిబంధనలు పాటించాలి. ఇది నాలుగు దశాబ్దాలుగా ఉన్న క్రమశిక్షణ. ఎవరూ కట్టుతప్పడానికి వీల్లేదు. అలాంటిది చాలా నియోజకవర్గాల్లో నాయకులు కట్టు తప్పుతున్నారు. తమకు తోచింది చేస్తున్నారు. అంతేకాదు.. మరికొందరు పదుల సంఖ్యలో ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ పరిణామాలు.. పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. నిజానికి 134 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ గజ్జల గుర్రంలా ముందుకు సాగాలి.
ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం.. అంతర్గత స్వతంత్ర పెరిగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ తరహా పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించడం.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం.. ఎవరికి తోచినట్టు వారు వ్యవహరించడం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రధాన లక్షణం. దీనిని ఆ పార్టీ నాయకులు అంతర్గత ప్రజాస్వామ్యంగా పేర్కొంటారు. దీనివల్లే పార్టీ నష్టపోయింది.
ఇప్పుడు ఈ తరహా పరిణామాలు, పరిస్థితులు.. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి బదిలీ అయ్యాయని అంటున్నారు. నాయకులు ఎవరికి తోచినట్టు వారు ఉంటున్నారు. ఉదాహరణకు.. గుంటూరు వెస్ట్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పల్నాడులోనూ.. రెండు నియోజకవర్గాలు మినహా.. మిగిలిన మరో రెండు నియోజకవర్గాల్లోనూ.. నాయకులు చిత్తానుసారం వ్యవహరిస్తున్నారు. విజయనగరంలో అయితే.. మరీ ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తోంది.
పార్టీకి, ప్రజలకు కూడా తీరని వ్యథను మిగిలిస్తున్నాయన్నది అధినేత చంద్రబాబు వరకు చేరిన సమాచారం. అంతేకాదు.. ఎవరికి వారు.. పక్క ఎమ్మెల్యేను చూసి నేర్చుకుంటున్నారన్నది బాబు చెబుతున్న మాట. అంతర్గత ప్రజాస్వామ్యం మంచిదే అయినా.. అది పార్టీకి మరింత చోదకశక్తిగా మారాలని సూచిస్తున్నారు. పనుల విషయంలో పోటీ పడే నాయకత్వం కోరుకుంటున్నారు. కానీ, ఇతర విషయాల్లో నాయకులు పోటీ పడుతున్న తీరు బాబును ఇబ్బందికి గురి చేస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.